ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. శుక్రవారం ఏపీలోని విజయవాడ, గుంటూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విజయాడ ఓల్డ్ జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అమరావతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఏపీలో జెండా ఎగరవేద్దాం.. అందుకు తగినంతగా శ్రమిద్దాం.
నరేంద్రమోడీ గ్యారంటీ మన బలం. కార్యకర్తల శ్రమతో మన గెలుపు ఖాయం. కరోనా వ్యాక్సిన్ తయారీకి మోడీ ప్రొత్సాహం అందించారు. కరోనాను ఎదుర్కొవడంలో భారత్ సక్సెస్ అయింది. సిద్దాంతపరమైన భావజాలంతో బీజేపీ పని చేస్తోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ ఆధారంగా బీజేపీ పని చేస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మన్సుఖ్ మాండవీయ ఏపీ పర్యటనలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆరోగ్యకరమైన సమాజం దేశాన్ని సమృద్ధిగా మారుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో 10 రకాల టెస్టులు జరుగుతాయని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
Also Read: CM Revanth Reddy: కౌన్ బనేగా కరోడ్ పతి షోలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్న.. ఏమడిగారంటే..?