ఏపీలో గత మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో గత ఐదేళ్లలో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2017లో 55 మంది, 2016లో 36 మంది, 2017లో 55 మంది, 2018లో 44 మంది, 2019లో 71 మంది, 2020లో 88 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
మరోవైపు తెలంగాణలో మాత్రం నిరుద్యోగుల ఆత్మహత్యల్లో హెచ్చతగ్గులు ఉన్నట్లు కేంద్ర సహాయమంత్రి రామేశ్వర్ తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 188 మంది నిరుద్యోగులు చనిపోయినట్లు ఆయన ప్రకటించారు. 2016లో 24 మంది, 2017లో 45 మంది, 2018లో 40 మంది, 2019లో 56 మంది, 2020లో 23 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు రామేశ్వర్ వివరించారు.
అటు ఏపీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3,246 నోటిఫైడ్ మురికివాడలు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు జవాబు ఇస్తూ… ఏపీలోని మురికివాడల సమాచారాన్ని ఆయన వెల్లడించారు. ఈ మురికివాడల్లో 37,93,605 మంది నివసిస్తున్నట్లు కౌశల్ కిషోర్ వివరించారు.