NTV Telugu Site icon

Mekapati Chandrashekar Reddy: ఎమ్మెల్యే మేకపాటికి అస్వస్థత.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు

Mekapati

Mekapati

Mekapati Chandrashekar Reddy: నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మర్రిపాడులోని తన నివాసంలో వైద్యులు చికిత్స చేశారు. అనంతరం మర్రిపాడు నుంచి చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి బయలుదేరారు.అక్కడి నుంచి చెన్నైకి తరలించే అవకాశం ఉంది. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. ఇప్పుడేమీ మాట్లాడలేనని మీడియాకు చెప్పారు. తన అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి తానే కారణమన్నారు. ఉదయగిరిలో జరుగుతున్న పరిణామాలకు తన అన్న మేకపాటి రాజమోహన్‌ రెడ్డే కారణమన్నారు. అనారోగ్యం వల్ల ఏమి మాట్లాడలేకపోతున్నానన్నారు. ఇప్పటికి తనకు మూడు స్టంట్లు వేశారని.. రాత్రి కూడా నొప్పి వచ్చిందన్నారు. గుండెనొప్పి రావడంతో చెన్నైకు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించిన చంద్రశేఖర్‌రెడ్డి గుండెలో రెండు వాల్వులు బ్లాక్‌ అయినట్లు గుర్తించారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోలుకున్నారు. 2021 డిసెంబర్‌లో కూడా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు రావడంతో బెంగళూరులో సర్జరీ చేసి స్టెంట్‌ వేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. మరోవైపు ఉదయగిరి రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు మూడురోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. దీంతో గురువారం సాయంత్రం మేకపాటి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు వెళ్లారు.. రోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నారు. ఎవరో ఉదయగిరికి వస్తే తరుముతామన్నారని.. వాళ్లెవరో ఇప్పుడు రావాలంటూ సవాల్ చేశారు.

Read Also: Police Station Robbery: ఇదేందయ్యా ఇది.. పోలీస్‌స్టేషన్‌లోనే దోపిడీ.. విలువైన వెండి ఆభరణాలు మాయం

ఆస్పత్రికి వెళ్లే ముందు మేకపాటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం కుదుటపడితే రాజకీయాల్లో ఉంటానని.. లేదంటే కూతురును చదివించుకుంటానన్నారు. ప్రభుత్వం ఉందని ఏ ఆటలైనా ఆడుకుంటారని.. తనకు తన ప్రజలు ఉన్నారన్నారు. ఉదయగిరి ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం కొరడాతో కొడుతుందని తన దగ్గరికి వచ్చేందుకు భయపడుతున్నారన్నారు. అన్ని విధాలుగా ఉదయగిరిని అభివృద్ధి చేశా…. బిల్లులు రావనే తన దగ్గరికి రావడం లేదని మేకపాటి వెల్లడించారు.