కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది.. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు అయితే, ప్రస్తుత నీటిమట్టం 1631.45 అడుగులకు చేరింది. ఇక, పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 95 టీఎంసీలు ఉన్నాయి.. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 1.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 33 గేట్లు ఎత్తి 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. దీంతో.. దిగువప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, మంత్రాలయం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది తుంగభద్ర నది.. స్నానానికి భక్తులు నదిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు సుంకేసుల ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకను నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో.. శ్రీశైలం డ్యామ్‌కు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది.