టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మంగళవారం ఓ ముఖ్య గమనికను విడుదల చేసింది. జూన్ 1 నుంచి తిరుమల కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది.
తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్న నేపథ్యంలో నిఘాను మరింత పటిష్టం చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ముఖ్యంగా అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్‌లను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. అంతేకాకుండా తిరుమల కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామని టీటీడీ హెచ్చరించింది. మరోవైపు తిరుమలలో షాంపుల వాడకంపైనా టీటీడీ నిషేధం విధించింది.