Srivani Darshan Tickets:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త సంవత్సరం శ్రీవాణి దర్శన్ టికెట్ పద్ధతిలో పెను మార్పులు చేసింది. గతంలో రోజుకు 800 టికెట్లు జారీ చేసిన ఆఫ్‌లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పూర్తిగా ఆన్‌లైన్ లోనే బుకింగ్ చేసుకునేలా మార్చేశారు. ఇక, ఇవాళ్టి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ శ్రీవాణి దర్శన్ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని టీటీడీ పేర్కొనింది. టికెట్ బుక్ చేసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది.
Read Also: Trump: అలా చేస్తే ఊరుకోం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
అయితే, ఒక్క కుటుంబంలో మొత్తం నలుగురు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆదార్ కార్డు, మొబైల్ నంబర్ లాంటి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి, ఇది టికెట్ల రద్దీని తగ్గించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, రేణిగుంట విమానాశ్రయంలో కౌంటర్ ద్వారా జారీ అయ్యే 200 టికెట్ల పద్దతి మాత్రం ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగుతుంది అని పేర్కొనింది. ఈ కొత్త ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానం ద్వారా భక్తులు ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.