Trump Issues Strong Warning to Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. దేశంలో ఇప్పటికే నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల్లో ప్రజలను హత్య చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవడంతో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌లో అల్లర్ల సమయంలో ప్రజలపై హింస చేయడం అక్కడి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. నిరసనల్లో ప్రజల ప్రాణాలు తీస్తే అమెరికా మౌనంగా ఉండదని, అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు.. ఇరాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలపై హింసకు పాల్పడితే ఇరాన్‌కు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.
READ MORE: Trump: ఆమె ప్రవర్తన దారుణంగా ఉంది.. ఇమ్మిగ్రేషన్ అధికారిని సమర్థించిన ట్రంప్
అసలు ఏం జరుగుతోంది?
ఇరాన్‌లో కరెన్సీ విలువ పడిపోతుండటంతో గత రెండు వారాలుగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కొనసాగుతోంది. ఇప్పటికే జరుగుతున్న నిరసనలు గురువారం రాత్రి మరింత ఉధృతంగా మారాయి. అమెరికాలో నివసిస్తున్న క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునివ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ఆయన పిలుపు తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఇరాన్ ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దింపి రోడ్లు ఖాళీ చేయించే ప్రయత్నం ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని కనీసం 50 నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. టెలిఫోన్ లైన్లను సైతం కట్ చేసింది. అయినా ప్రజలు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రోడ్లపైకి వస్తున్నారు.