Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి కట్టబెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. చాగంటిని టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది.. ఈ మేరకు హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి.. ఆ తర్వాత సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాతో పంచుకున్నారు వైవీ సుబ్బారెడ్డి.. చాగంటిని టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించినట్టు పేర్కొన్నారు.. ఇక, గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. గ్రామస్తులకు భజన, కోలాటం సామగ్రి అందించాలని, మానవాళి శ్రేయస్సుకు యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించారు.. ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు..