ఏపీ వైద్య శాఖలో బదిలీల వివాదం రాజుకుంది. ఐదేళ్లు సర్వీసు పైబడిన వారికి స్థాన చలనం కలిగించాలన్న ఆదేశాలను వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఎంసీఐ నిబంధనల మేరకు పరిశోధనలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. వైద్యశాఖలో జీవోఆర్టీ నెంబర్ 40 కుదుపు మొదలైంది. ఈ ఆదేశాల ప్రకారం ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసు కున్న వైద్యులను బదిలీ చేయాలిసి ఉంటుంది. మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు కూడా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేయనున్నారు.
ఈ లెక్కన ప్రస్తుతం వివిధ స్థానాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు, డాక్టర్లలో ఎక్కువ శాతం మందికి స్థాన భ్రంశం తప్ప దు. ఒక్క విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్ పరిధిలో KGH,టీబీ, ఐడీ, మెంటల్ కేర్, ఆర్.హెచ్, ఈఎన్టీ, ఆర్సీడీ, ఘోషాస్పత్రులున్నాయి. వీటిలో 378 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరిలో 78శాతం మందికి బదిలీ తప్పదు. అంటే ఏఎంసీ నుంచి ఒకేసారి 297 మంది వైద్యు లు బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
గతంలో అర్హులైన వారిలో 20 శాతం మందిని బదిలీ చేసేవారు. ఈసారి అర్హులైన వారందర్నీ బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్స్ అసోసియేషన్ అంటోంది. వైద్యుల వివరాలు ఇప్పటికే డీఎంఈ ఆఫీస్‌కు చేరాయి. ఆంధ్రా మెడికల్ కాలేజ్ పరిధిలో ఎక్కువ మంది ఏళ్ల తరబడి ఇక్కడే సేవలందిస్తున్నారు. తాజా ఆదేశాల ప్రకారం బదిలీలు జరిగితే పరిశోధన కుంటుపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖ మెడికల్ హబ్ గా మారడంతో సీనియర్ వైద్యులు చాలా మంది ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత మంది బదిలీపై వెళ్లడానికి ఓకే చెబుతారన్నది ప్రశ్నార్ధకమే..!