బెంగాల్ మదర్సాలో ఫుడ్ పాయిజనింగ్..100 మందికి అస్వస్థత..
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపుగా 100 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అన్స్‌గ్రామ్ లోని పిచ్‌కురి నవాబియా మదర్సాలో జరిగింది. శనివారం ఉదయం దాదాపు 7-8 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. ఆ తర్వాత గంట గంటకు బాధిత విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది.
మహిళ నగ్న మృతదేహం కేసు.. ఇప్పటికీ దొరకని తల.. రంగంలోకి 12 టీంలు..
నిజామాబాద్ జిల్లా మిట్టాపూర్‌లో జరిగిన మహిళ దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 12 టీంలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ శవం లభ్యమంటూ పోలీసులు పోస్టర్లు అతికించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లు ముద్రించారు. వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం అదించారు. మిస్సింగ్ కేసులు నమోదైతే సమాచారం ఇవ్వాలంటూ నవీపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు. మహిళ వయసు 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఎడమ కాలి మడమపై పుట్టు మచ్చ ఉన్నట్లు గుర్తించారు. ముథోల్, మాక్లూర్, మహారాష్ట్రలోని ధర్మబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. మహిళా తల భాగం, చేతి వేళ్ళు, మణి కట్టు ఇప్పటికి దొరకడం లేదు. దీంతో నగ్న మృతదేహాం కేసు మిస్టరీగా మారింది.
నాలుగు గంటలుగా పోలీస్ స్టేషన్లోనే జోగి రమేష్.. ఇంట్లో సిట్ సోదాలు!
విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో నాలుగు గంటలుగా వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఉన్నారు. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన ఇంటిలో సిట్ అధికారుల తనిఖీలు చేపట్టారు. నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంభందించి ఏమైనా పత్రాలు ఉన్నాయా అనే కోణంలో సోదాలు చేస్తున్న అధికారులు.. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీమ్ వెళ్లింది. గంటకు పైగా తనిఖీలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వంలోని పార్టీలు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాయి..
శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మరణించిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తొక్కిసలాట సంఘటనలు మూడుసార్లు జరిగాయని గుర్తు చేశారు. ఆలయ ప్రతిష్టాపన తర్వాత ప్రతి శనివారం సుమారు 2 వేల మంది వస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. కానీ, నిన్న ఎక్కువ జనం పెరిగారని తెలిపారు. తాము ఈ విషయంపై రాజకీయం చేయదలచుకోలేదని, కానీ ప్రభుత్వం తమ బాధ్యతలు మార్చిపోయిందని బొత్స కోరారు.
పాకిస్తాన్‌లో పేలుళ్లతో కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరువు..
ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. బీహార్‌లోని అర్రాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్‌లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోతోంది. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ కోలుకోలేదు’’ అని గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.
నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు.. లండన్‌లో చంద్రబాబు దంపతులు..!
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు వారికి ఘన స్వాగతం పలికాయి. ముఖ్యమంత్రి దంపతులు ఆప్యాయంగా తెలుగు వలసదారులతో మాట్లాడారు. ఈ పర్యటనలో వ్యక్తిగత అంశాలతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంకు కూడా హాజరుకానున్నారు. నవంబర్ 4న లండన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకోనున్నారు.
కేకే సర్వే రిపోర్ట్‌పై కాంగ్రెస్ ఆగ్రహం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే వివాదం రచ్చ రేపుతోంది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌ఓ) సాయిరాం ను కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ భేటీ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి సర్వేలను ప్రచురించడం నిషేధమని గుర్తు చేశారు. అయితే కేకే సర్వే ఉద్దేశపూర్వకంగానే విడుదలైందని, ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కేకే సర్వే రెండు గంటల్లోనే తయారు చేసిన ఒక లిస్ట్‌ను “సర్వే రిపోర్ట్”గా విడుదల చేసిందన్నారు. ఇది పూర్తిగా కేటీఆర్, హరీష్ రావు డైరెక్షన్‌లో జరిగిన చర్య అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ సర్వే ఉపయోగపడిందని అన్నారు.
హైదరాబాద్ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేగంగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం షేక్‌పేట్‌లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది మా ప్రియమైన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఎన్నిక. మాగంటి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఎంతో సేవ చేసింది. అందుకే వారి భార్య మాగంటి సునీతమ్మకు టికెట్ ఇచ్చాం. మా పార్టీ ఎప్పుడూ తమ నాయకుల కుటుంబాలను గౌరవంగా చూసుకుంటుంది అని అన్నారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రి కానున్న రాబ్ జెట్టెన్ ఎవరు ?
నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. దేశంలో అక్టోబర్ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో D66 పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో డచ్ సెంట్రిస్ట్ పార్టీ D66 నాయకుడు, 38 ఏళ్ల రాబ్ జెట్టెన్ దేశంలో మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్కుడు, అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి కానున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విజయం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “ఈ ఎన్నికల్లో మనం అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది D66 కి చారిత్రాత్మక ఫలితం, కానీ దానితో పాటు గొప్ప బాధ్యత కూడా మనపై ఉంది” అని అన్నారు.
కొడుకును కాపాడుకునేందుకు బంగారం అమ్మిన తల్లి..!
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెద్దూరు గ్రామంలో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడిని బెట్టింగ్ ముఠా ఉచ్చులోకి లాగి భారీ మొత్తంలో వసూళ్లు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రణయ్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నాడని, దీనిని ఆసరాగా తీసుకున్న బెట్టింగ్ ముఠా సభ్యులు అతడిపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి దాదాపు రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ముఠా బెదిరింపులకు భయపడి ప్రణయ్ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొడుకును కాపాడుకునేందుకు ఇంట్లో ఉన్న బంగారం అమ్మి, అప్పులు చేసి కూడా ముఠాకు డబ్బులు అందజేసినట్లు యువకుడి తల్లి తెలిపింది. అయితే డబ్బులు ఇచ్చినా వేధింపులు ఆగకపోవడంతో కుటుంబం తీవ్ర నిరాశకు గురై ఉమ్మడి ఆత్మహత్యకు నిర్ణయించుకున్నదని తెలుస్తోంది.