తిరుమల వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది. ఈనెల 20న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను ఈనెల 22 వరకు బుక్ చేసుకునేందుకు గడువు విధించినట్లు తెలిపింది. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టిక్కెట్లను కేటాయిస్తామని టీటీడీ వివరించింది. ఈనెల 22న టిక్కెట్లు పొందిన వారికి వివరాలు పంపిస్తామంది.
ఈనెల 20న ఆర్జిత సేవా టిక్కెట్లలో భాగంగా సుప్రభాతం సేవ, తోమాల సేవ, అర్చన టిక్కెట్లు, అష్టదళ పాదపద్మారాధన సేవ, నిజపాద దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి తొలుత బుక్ చేసుకున్న వారికి మొదటిగా (FIFO పద్ధతిన) కేటాయించడం జరుగుతుందని టీటీడీ అధికారులు చెప్పారు. స్వామివారి ఆర్జిత సేవలను కోరుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.