Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అయితే, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 14 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇక, శ్రీవారి దర్శనం సజావుగా కొనసాగించేందుకు అదనపు ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ పేర్కొంది. కాగా, నిన్న ఒక్క రోజులోనే 76,289 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, 27,586 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. భక్తుల సమర్పణలతో హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ల నిర్వహణ, అన్నప్రసాదాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసినట్లు వెల్లడించారు.
అలాగే, ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానున్నాయి. ధనుర్మాసం కారణంగా నెల రోజుల పాటు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ధనుర్మాసం పూర్తి కావడంతో సుప్రభాతం సేవను పునరుద్ధరించారు.