TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన గోశాలలో గోవులు మృతిచెందాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇలా అందరిపై ఆరోపణలు గుప్పించారు.. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.. అయితే, ఎస్వీ గోశాలలో గోవులు మృతిచెందాయంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన టీటీడీ.. గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేసింది..
Read Also: CSK Captains: ధోనీ టు రుతురాజ్.. సీఎస్‌కే కెప్టెన్స్ లిస్ట్ ఇదే! మూడుసార్లు మహీనే
టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది టీటీడీ.. మృతి చెందిన గోవుల ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు అసలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవుల ఫొటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి.. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారం అని కొట్టిపారేసింది.. గోవుల చనిపోయాయంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన టీటీడీ.. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఈ ప్రకటన విడుదల చేసింది టీటీడీ..