Three Ladies Trapped Old Man: ఆయన ఒక వృద్ధుడు (60). భార్య చనిపోయి ఒంటరిగా జీవితం గడుపుతున్న ఆయన.. తనకు ఓ తోడు ఉంటే బాగుంటుందని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు అమ్మాయిలు.. ఆయన్ను ట్రాప్ చేశారు. తమ మాయమాటలతో ముగ్గులోకి దింపుకొని, లక్షల్లో దోచుకొని ఉడాయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని నెహ్రూనగర్‌కి చెందిన ఓ వృద్ధుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని కాపురానికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే తోడు కావాలని కోరిన ఆయన.. ఒక పత్రికలో ఓ ప్రకటన చూశారు. అందులో పొందుపరిచిన వివాహాల మధ్యవర్తికి ఫోన్ చేశాడు. అటువైపు నుంచి మాట్లాడిన ఓ అమ్మాయి.. ముందుగా తన ఖాతాలో రూ. 3 వేలు జమ చేయాలని కోరింది. ఆ అమ్మాయి చెప్పినట్టుగానే ఆయన రూ. 3 వేలు జమ చేయగా.. ఆమె ఒక ఫోన్ నంబర్ ఇచ్చింది. అప్పట్నుంచి అసలు కథ మొదలైంది.
ఆ నంబర్‌కి వృద్ధుడు ఫోన్ చేయగా.. అటువైపు మాట్లాడిన అమ్మాయి, కలిసి జీవించేందుకు సమ్మతమేనన్నట్టు మాట్లాడింది. కొన్ని రోజుల తర్వాత తనకు రూ. 1 లక్ష కావాలని కోరింది. అయితే.. ఆ వృద్ధుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో, ఆమె ఫోన్ మాట్లాడటం మానేసింది. కట్ చేస్తే.. రెండు రోజుల తర్వాత మరో మహిళ నుంచి ఆ వృద్ధుడికి ఫోన్ వచ్చింది. తనకు ఎవరూ లేరని, తనకు చాలా ఆస్తి ఉందని, తాను కూడా తోడు కావాలని కోరుకుంటున్నట్లు ఆ మహిళ నమ్మించింది. దీంతో తనకు ఎట్టకేలకు ఒక తోడు దొరికిందని ఆ వృద్ధుడు సంబరపడ్డాడు. అయితే, కొన్నిరోజుల్లోనే ఆయన ఆనందం ఆవిరైంది. కుటుంబ అవసరాల కోసం రూ. 1 లక్ష కావాలని, డబ్బులు ఇస్తే వెంటనే నీ వద్దకు వచ్చేస్తానని ప్రేమగా చెప్పింది. ఆమె మాటలకు ఫిదా అయిన ఆ వృద్ధుడు.. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే ఆమె ఖాతాలోకి రూ. 1 లక్ష జమ చేసేశాడు. అంతే, మళ్లీ ఆమె వద్ద నుంచి ఆయనకు ఫోన్ రాలేదు. ఆ వృద్ధుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఆమె ఫోన్ తీయలేదు.
మరికొన్ని రోజుల తర్వాత మరో మహిళ ఆ వృద్ధుడికి ఫోన్ చేసింది. ఈమె కూడా సేమ్ స్టోరీ అల్లింది. అయితే.. ఆల్రెడీ తనకు ఇద్దరు మహిళలు టోకరా వేయడంతో, ఈ మూడో మహిళను వృద్ధుడు పట్టించుకోలేదు. కానీ.. ఆమె మాత్రం పదే పదే ఫోన్ చేయడంతో, ఆ వృద్ధుడు టెంప్ట్ అయి ఒకరోజు ఆమెతో మాట్లాడాడు. తనని ఇద్దరు మహిళలు మోసగించారని ఆ వృద్ధుడు చెప్పగా.. తాను అలాంటిదాన్ని కానని, తన భర్తలో మగతనం లేకపోవడంతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నానని చెప్పింది. తన వద్ద కోట్ల ఆస్తి ఉందని, వేరే వాళ్లని మోసం చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపింది. ఈసారి ఈ మహిళ మోసం చేయదన్న నమ్మకంతో, ఆమెని నమ్మాడు. ఆమె కూడా పెళ్లి చేసుకుంటానని మాయ చేసింది. కొన్ని రోజులయ్యాక తన అమ్మమ్మ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. లక్ష కావాలని, నగదు ఇస్తే వారం రోజుల్లోనే ఇస్తానని పేర్కొంది.
ఈసారి ఆ వృద్ధుడు ఖాతాలో వేయకుండా, నేరుగా కలవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సమ్మతమేనన్న ఆ మహిళ.. తాను బస్సులో వస్తానని, బస్టాండ్‌లో రిసీవ్ చేసుకోవాలని కోరింది. ఆమె చెప్పినట్లుగానే బస్ స్టాండ్‌కి రావడంతో.. ఆ మహిళ మోసగించదని అనుకున్నాడు. ఇంతలోనే ఆ మహిళ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌కి సమయం అవుతోందని చెప్పి, ఆ వృద్ధుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కూడా ఫోన్ చేస్తే స్పందించలేదు. ఇలా మూడుసార్లు మోసపోయిన ఆ వృద్ధుడు.. చివరికి పోలీసుల్ని ఆశ్రయించాడు.