ఏపీ రాజధాని అమరావతిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ భవనాలే టార్గెట్‌గా దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. ఈ మేరకు నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల్లో విలువైన సామాన్లను దొంగలు దోచుకెళ్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్కనే రూ.110 కోట్లతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో దొంగలు ప్రవేశించి విలువైన ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లతో పాటు కరెంట్ వైర్లు, విలువైన ఎలక్ట్రికల్ సామాగ్రిని దోచుకుపోతున్నారు.
ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు కొంతకాలంగా నిలిచిపోవడంతో దొంగలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మాణాలలో ఉన్న భవనాలు కావడం, అందులోనూ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. దీంతో దొంగలు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. కాగా గతంలోనూ అమరావతి ప్రాంతంలో రోడ్లను తవ్వేసి గ్రావెల్‌ను ట్రాక్టర్లు, టిప్పర్లలో గుర్తుతెలియని వ్యక్తులు దోచుకుపోవడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ పనుల వెనుక రాజకీయ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.