వెంటనే ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకపోయినా.. నేతల పర్యటనలు, ప్రకటనలు చూస్తేంటే.. ఎన్నికలు వచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరోవైపు.. ఇక, జనసేన, బీజేపీ, వామపక్షాలు.. ఇలా ఎవరి వ్యూహాల్లో వారు మునిగిపోయారు.. అయితే, ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు టీడీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న… విశాఖపట్నంలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.. ధన దాహం వున్న రాక్షసుడు జగన్… అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మండిపడ్డ ఆయన.. రానున్న ఎన్నికల్లో జగన్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇక, ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నాం.. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో 28 చోట్ల తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎవరికి అన్యాయం జరిగినా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తామని తెలిపారు బుద్దా వెంకన్న.. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. సీఎం జగన్‌పై రాష్ట్రంలోని రూ.2వేల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు వెంకన్న.. అయితే, జగన్ కు ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం వల్లే వరదల రూపంలో ఇలాంటి ప్రమాదం వచ్చిందని విమర్శించారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. జగన్ తో ఎలా మాట్లాడాలో మంత్రులు ప్రజలకు ట్రైనింగ్ ఇస్తారా…? అని ఎద్దేవా చేశారు. విపత్తు సహాయక నిధులు అడ్డగోలుగా మళ్లించేశారని ఆరోపించారు.
మరోవైపు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్దంగా వున్నామని ప్రకటించారు మాజీ మంత్రి కళా వెంకట్రావు… రైతులకు 10 బస్తాల విత్తనాలు ఇవ్వాల్సిన చోట ఒక బస్తా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీరో చక్రవర్తి మాదిరి తాడేపల్లిలో వుంటున్నారు.. అంటూ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు.. పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు తిరిగి తెలంగాణకు వెళ్లిపోతామనడం ప్రభుత్వానికి సిగ్గు చేటు అని మండిపడ్డారు.. అభివృద్ధి, సంక్షేమం ఏరకంగా వుందో అనడానికి ఇదే నిదర్శనంగా తెలిపారు కళా వెంకట్రావు.