నెల్లూరు నగరం హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్. అక్కడ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య జరుగుతున్న లే ఔట్ పాలిటిక్స్ అందరిలో ఆసక్తిని రేవుతున్నాయి. సవాళ్లు..ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. లే ఔట్ ల వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నెల్లూరు నగరంలో హాట్ టాపిక్ గా మారిన అక్రమ లే ఔట్ ల వ్యవహారం పలు మలువులు తిరుగుతోంది. మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ వేసిన లే ఔట్ కు బినామీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణలు చేశారు.
దీనికి మాజీ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్న మూడు సంవత్సరాలలో మాజీ మంత్రి అనిల్ కుమార్ వందలాది కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ..అక్రమ లే ఔట్ ల వెనుక ఆయనే ఉన్నారని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. కిన్నెర ప్రసాద్ 2020 లో వైసీపీలోకి వచ్చారని అంతకుమునుపు టీడీపీలో వుంటూ పలు లే ఔట్ లు వేశారని..వాటిల్లో కూడా కోట్ల మేర అవినీతి జరిగిందా అని అనిల్ ఎదురు ప్రశ్నలు వేశారు.
అనిల్ ఆరోపణల పై వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరడంతో పాటు అక్రమ లే ఔట్ ల పై విచారణ చేయాలని నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ కు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమ లే ఔట్ ల కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన అనిల్…దీనిపై ప్రమాణం కూడా చేస్తానని అన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాంలోనే అక్రమాలు అధికంగా జరిగాయని చెప్పారు. తాను కూడా అనిల్ అవినీతిని నిరూపిస్తానని కోటం రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. నగర పరిధిలో అనిల్ అనుచరులు ప్రభుత్వ శివారు భూములను ఆక్రమించుకుని లే ఔట్లు వేశారని దానిని తాను నిరూపిస్తానని కోటంరెడ్డి చెబుతున్నారు.
నెల్లూరు నగరంలోని మూడో మైలు ప్రాంతంలోని ప్రశాంతి నగర్ లో అనిల్ అనుచరులు భూ కబ్జాకు పాల్పడటంతో పాటు అక్రమ లే ఔట్ ల ద్వారా విక్రయిస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. అనిల్ బాగోతం బట్టబయలు అవుతుండటంతోనే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని శ్రీనివాసులు రెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో విచారణకు అంగీకరిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఎవరి హయాంలో ఎన్ని అక్రమ లే ఔట్లు వేశారు. ఎంత మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే విషయంతో పాటు అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
