ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా? జగన్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపక్షాలకు చిక్కకుండా ఉండేందుకు రెండు అడుగులు ముందే ఉండాలని.. రెండేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా? జగన్ ముందస్తు ఎన్నికల ప్రిపరేషన్ చేస్తున్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా? ప్రభుత్వ పని అయిపోయింది కాబట్టే ముందస్తుకు ప్లాన్ వేస్తున్నారనే కృత్రిమ చర్చకు శ్రీకారం చుడుతున్నారా? అసలు ముందస్తుతో మాకేం పనంటున్న అధికార పార్టీది నిజంగా ధీమానేనా? అంతర్గతంగా రెఢీ అవుతోందా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఇంకా రెండేళ్ళ టైం వుండగా ఇప్పుడెందుకీ ముందస్తు ముచ్చట. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే.
ఏపీ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల చర్చ జోరందుకుంది. సీఎం జగన్ ఏం అనుకుంటున్నాడో ఏమో కానీ ప్రతిపక్షాలు మాత్రం అదిగో ముందస్తు… ఇదిగో ముందస్తు అనేస్తున్నాయి. అంతేకాదు బరిలోకి దూకేందుకు రెఢీగా ఉండాలని కేడర్ ను సిద్ధం చేసేస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్లు ఉంది.. అయినా ఈ ముందస్తు స్టేట్మెంట్లు… వాటికి కౌంటర్లు ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏపీలో అధికార పార్టీ సహా అన్ని పార్టీలు రోడ్ల మీదే ఉన్నాయి. వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ఊరూర, గడప గడపకు వెళ్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు పేరుతో ప్రతి గడపలో తిరుగుతోంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల పరామర్శ, ఆర్థిక సహాయం అందజేసేందుకు జిల్లాల్లో తిరుగుతున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. బీజేపీ కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన కార్యక్రమం తీసుకుంటోంది.
ముందస్తు ఎన్నికల చర్చకు ముందుగా తెర తీసింది టీడీపీనే. ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోతోందని… అది ఇంకా అథమస్థాయికి పోక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం చూస్తున్నారని టీడీపీ అంటోంది. టీడీపీ సమావేశాల్లోనూ చంద్రబాబు నోట పదే పదే ముందస్తు మాట వినిపిస్తోంది. అసలు గతంలో ముందస్తుకి వెళ్లింది చంద్రబాబే. అంతేకాదు కార్యకర్తలనూ రెఢీ చేస్తోంది ఆ పార్టీ. జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఆయనకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ గట్టిగా తిప్పికొడుతోంది. ముందస్తు అంటే షెడ్యూల్ కంటే ఆరేడు నెలలు ముందు ఎన్నికలకు వెళ్లడం. గతంలో పలు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ముందుస్తుకు వెళ్లాయి. కొన్ని సక్సెస్ అయితే కొన్ని నష్టపోయాయి. 2004లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వెళ్లి ఘోరంగా ఓడిపోయారు. 2019లో జరగాల్సిన ఎన్నికలను 2018 చివర్లో నిర్వహించేలా ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుందని అనుకున్నప్పుడో లేక… ప్రతిపక్షాలు బలం పుంజుకోబోతున్నాయని అనిపించినప్పుడో లేక… ఏదైనా సెంటిమెంట్ కలిసి వస్తుందని అంచనా వేసుకున్నప్పుడో ప్రభుత్వాలు ముందస్తుకు వెళ్తుంటాయి.
జగన్ ప్రభుత్వం వీటిల్లో వేటినీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికి లక్షన్నర కోట్ల రూపాయలను వివిధ పథకాల రూపంలో జనానికి అందజేసింది వైసీసీ సర్కారు. వచ్చే ఏడాది 55వేల కోట్లు… ఆ తర్వాతి సంవత్సరం మరో 55 వేల కోట్ల రూపాయలను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇవికాక 35 లక్షల కుటుంబాలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇలా తామిచ్చిన పథకాల ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే ఒక్కోక్కటిగా కనిపిస్తున్నాయని… అవన్నీ తమకు కలిసి వస్తాయని… అలాంటప్పుడు ముందస్తు మాటే ఎందుకన్నది వైసీపీ ప్రశ్న.
మరి టీడీపీ ఎందుకీ ముందస్తు పాటపాడుతోంది. వాస్తవంగా ఎన్నికలకు టీడీపీనే సిద్ధంగా లేదని ఆ పార్టీ నేతల మాటల్లోనే వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కాకినాడ. చిత్తూరు జిల్లాల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు… వైసీపిని గద్దె దించడానికి అందరూ కలసిరావాలని పిలుపు ఇచ్చారు. తమ పార్టీ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. దీన్నిబట్టి చూస్తే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేంతగా టీడీపీ రెఢీ కాలేదని అర్ధం అవుతోంది. జనసేనను ఉద్దేశించే అందరూ కలిసి రావాలని చంద్రబాబు అన్నారనే ప్రచారమూ ఉంది. మైండ్ గేమ్ తో వైసీపీ మీద పై చేయి సాధించడానికి, ప్రభుత్వ వైఫల్యం చెందిందనే దానిపై చర్చ జరగాలన్నదే టీడీపీ వ్యూహంలా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అంటే… ప్రభుత్వం పని అయిపోయిందనే చర్చకు తెర తీయడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే సమయం సందర్భంలేకుండా టీడీపీ ముందస్తు పాట పాడుతోందని వైసీపీ కొట్టిపారేస్తోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ ముందస్తు మాటెత్తకున్నా… ఓటు చీలకుడా ఉండేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని పదేపదే పిలుపు ఇస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్… ఆ పార్టీతో కలిసి వైసీపీని ఓడించడం సాధ్యం కాదనుకున్నారో… లేక మరింత బలం కావాలనుకున్నారో ఏమో కానీ… ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా ప్రతిపక్షాల ఏకం గురించే ఆయన మాట్లాడుతున్నారు.
రెండేళ్ల ముందే ముందస్తు చర్చకు తెర తీయడం ద్వారా టీడీపీ మైండ్ గేమ్ ఆడాలని చూస్తోందని వైసీపీ అంటోంది. కానీ అది సక్సెస్ కాదని… అధికార పార్టీ అంటోంది. రెండేళ్ల కోసం గత నెలలోనే మంత్రి వర్గవిస్తరణకు వెళ్లారు జగన్. బీసీలకు పది మంత్రి పదవులు ఇవ్వడంతోపాటు…ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్ లో 17 పదవులు ఇచ్చారు. తాజాగా ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు సీట్లను బీసీలకు ఇచ్చారు. ఇలా పకడ్బందీ సోషల్ ఇంజనీరింగ్ తో ఎన్నిలకు సిద్ధం అవుతున్న జగన్ కు ముందుస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని పార్టీలోని కీలక వర్గాలు చెబుతున్నాయి. ఓడి మూడేళ్లు అయినా ఇంకా బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయనేది వైసీపీ విశ్లేషణ.