Rayapati SambasivaRao: గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కష్టపడే వారికి టికెట్లు ఇవ్వాలని.. తమ కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబును అడిగామని.. దీనికి టీడీపీ అధిష్టానం సమాధానం చెప్పాలని రాయపాటి అన్నారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమలో ఎక్కడ ఇచ్చినా తమ రాజకీయ వారసుడు రంగబాబు పోటీ చేస్తాడని రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకు ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. అధిష్టానం ఇలాగే వ్యవహరిస్తే తమ వర్గం సహకరించదన్నారు. తన సీటు తన వారసుడికి ఇవ్వాలని.. అవసరం అనుకుంటే తానే పోటీ చేస్తానని తెలిపారు. తాను పోటీలోకి దిగితే ఎవరూ పనికి రారన్నారు.
Read Also: USA: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురి మృతి
తాడికొండ నియోజకవర్గ టీడీపీ నేత తోకల రాజవర్ధన్‌రావు ఆధ్వర్యంలో సోమవారం నాడు టీడీపీ నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయపాటి సాంబశివరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోం అని రాయపాటి సాంబశివరావు అన్నారు. తనకు తెలియకుండా నరసరావుపేట సీటు వేరేవాళ్లకు ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తానన్నారు. పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు సహకారంతో తానే అభివృద్ధి చేశానని.. అలాంటి తమకు సీటు ఇవ్వక పోతే ఎలా అని ప్రశ్నించారు.