టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించేందుకు సీఐడీ కార్యాలయానికి వచ్చిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు, సుఖవాసి, కనపర్తిలను పోలీసులు అరెస్ట్ చేశారు,
కాగా సీఐడీ అధికారులు కావాలనే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. రఘరామ కృష్ణంరాజును కొట్టినట్లు అశోక్ బాబును సైతం కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అశోక్‌బాబు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ముందస్తు బెయిల్ తీసుకోలేదన్నారు. శుక్రవారం నాడు అరెస్టులు చేసి ఈ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు.