Telugu Desam Party: ఏపీ సీఎం జగన్‌కు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగలేఖ రాశారు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దిబ్బలు, ద్వీపాల్లో యధేచ్ఛగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని ఎమ్మెల్యే అనగాని తన లేఖలో ప్రస్తావించారు. జూద కేంద్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని గుర్తుచేశారు. రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు కృష్ణా నదీ తీరంలో మోర్తోట సమీపంలోని దిబ్బలు, ద్వీపాల్లో జూద కేంద్రాలు నడుస్తున్నాయని లేఖలో వివరించారు.
సామాన్య ప్రజలు నదీ తీర ప్రాంతానికి వెళ్లాలంటే అనేక ఆంక్షలు విధిస్తున్నారని.. పేకాట రాయుళ్లకు మాత్రం ప్రత్యేక పడవులు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. పేకాట రాయుళ్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. ఆర్గనైజ్‌డ్ గ్యాంబ్లింగ్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అనగాని ప్రశ్నించారు. మూడు ముక్కలాటతో ప్రజలు జోకర్లుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Andhra Pradesh: టీవీ చూస్తున్న భార్య.. ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త
రెండు రోజుల క్రితం రేపల్లె మండలం పేటేరు గ్రామంలో పేకాట కేంద్రాల్లో సర్వస్వం కోల్పోయి గుండెపోటుతో ఒకరు ప్రాణాలు కోల్పోయాడని అనగాని తెలిపారు. రేపల్లె కేంద్రంగా కొత్తగా డీఎస్పీ కార్యాలయం ప్రారంభించి సీఐ, నలుగురు ఎస్సైలు ఉన్నా.. పేకాట కేంద్రాలను నిలువరించలేకపోతున్నారన్నారు. చాటుమాటున ఆడే చిన్నాచితకా పేకాటరాయుళ్లపై దాడులు చేసి కేసులు పెట్టే ప్రభుత్వం రేపల్లె నదీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట క్లబ్బులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వెంటనే పేకాట క్లబ్బులను మూసి వేయించి నదీతీర ప్రాంతంలో గస్తీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. పేకాట క్లబ్బులను నిర్వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, ఆయన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.