విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, మాణిక్యాలరావు, ఎంఎస్ రాజు కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అనంతబాబు విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అనంతబాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఏజెన్సీ ఏరియాలో అనంతబాబు గిరిజనులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. ఆయన గిరిజనుల హక్కులను దోచుకున్నాడని తెలిపారు.
Jayaprada: ఆంధ్రప్రదేశ్ 7 లక్షల కోట్ల అప్పుల ప్రదేశ్‌గా మారింది
అడ్డతీగలలో ఫేక్ సర్టిఫికెట్‌తో ఎంపీపీగా కొనసాగాడని, అటవీ సంపదను అక్రమంగా అమ్ముకున్నాడని.. అనంతబాబు పెద్ద క్రిమినల్ అని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శలు చేశారు. జైలులో ఆయనకు రాచమర్యాదలు కల్పిస్తున్నారన్న విషయం కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. హత్య ఘటనలో పోలీసుల విచారణ ఏమీ లేదని.. అనంతబాబు ఏం చెప్తే దానినే రికార్డ్ చేశారని నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితంలో ఉండటం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అనంత బాబుపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతబాబును వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆయన అక్రమ మైనింగ్ చేసేవాడని.. ఆయన్ను కఠినంగా శిక్షించాలని కోరారు. టీడీపీ నేతలు ఏ తప్పు చేయకపోయినా అక్రమ కేసులు పెడుతున్నారని.. హత్య చేసిన అనంత బాబుకు తగిన శిక్ష మాత్రం వేయడం లేదని ఆరోపించారు.