వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పాలనలో నిత్యం హత్యలు, దాడులు, మహిళలపై మానభంగాలతో రాష్ట్రం వల్లకాడులా మారిందని విమర్శించారు. మాచర్లలో జల్లయ్య హత్య ముమ్మూటికి వైసీపీ ప్రభుత్వ హత్యే అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా పోస్టుమార్టం చేసి తీసుకెళ్లారని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా టీడీపీ నేతల్ని, బీసీ సంఘాల నేతల్ని హౌస్ అరెస్టులు చేయటం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత పిన్నెల్లి తన స్వార్థం కోసం పల్నాడును వల్లకాడుగా మార్చారన్నారు.
చంద్రయ్య హత్య జరిగినప్పుడే పిన్నెల్లిపై హత్య కేసు నమోదు చేసి ఉంటే జల్లయ్య హత్య జరిగేది కాదని కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో 37 మంది టీడీపీ కార్యకర్తలను జగన్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. వైసీపీ పొట్టన పెట్టుకున్న వారిలో 26 మంది బీసీలే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ బీసీలపై జగన్ మారణ హోమం సాగిస్తూ ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కుతున్నారని కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. 10 మందికి మంత్రి పదవులు ఇచ్చి వందల మంది బీసీల ప్రాణాలు తీయడం సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. జగన్ అరాచక పాలనపై అన్ని పక్షాలను కలుపుకుని పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.