Kala Venkatrao: వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన వసతి గృహాల రేట్లను భారీగా పెంచి భక్తులపై మరింత అధిక భారం మోపడం దురుద్దేశపూరితమని మండిపడ్డారు. మొన్న లడ్డూ రేట్లు పెంచారని, నిన్న బస్ ఛార్జీలు పెంచారని.. నేడు వసతి గదుల రేట్లు పెంచి తిరుమల వెంకన్నను భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. రూ.50 నుంచి రూ.200 ఉండే అద్దెగదుల రేట్లను రూ.750 నుంచి రూ.2,300కు పైగా పెంచటం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడిని భక్తులను దూరంచేయడానికి గత మూడేళ్లుగా కొనసాగుతున్న చర్యల్లో భాగమే అద్దె గదుల రేట్ల పెంపు అని విమర్శలు చేశారు.
Read Also: Mahindra Thar: జనవరి 9న కొత్త మహీంద్రా థార్.. గతంలో కన్నా ధర తగ్గే అవకాశం..
ఇలాంటి చర్యల వల్ల బాలాజీని దర్శించుకునే కోట్లాది భక్తుల మనసుల్లో అపోహలు, అనుమానాలు కలిగే అవకాశం ఉందని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం టీటీడీకు వేలాది కోట్ల ఆదాయం, ఆస్తులను కలిగిస్తున్న భక్తులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ.. దానికి విరుద్ధంగా వసతి గృహాలను భక్తులకు అందుబాటులో లేని విధంగా చేయటం దుర్మార్గమన్నారు. గత మూడున్నరేళ్లుగా బాదుడే బాదుడు అంటూ పన్నులు పెంచి ప్రజలపై మోయలేని భారాలను మోపిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు తిరుమలను కూడా వ్యాపార సంస్థగా మార్చి భగవంతుడిని భక్తులకు దూరం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. పెంచిన అద్దెగదుల రేట్లను తిరుపతి తిరుమల దేవస్థానం వెంటనే విరమించుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లు కళా వెంకట్రావు పేర్కొన్నారు.