గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పీఆర్సీకి సంబంధించి చర్చలు జరుగుతునే ఉన్నాయి. పీఆర్సీ విషయంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు పొత్తు కుదరడం లేదు. దీంతో ఈ అంశం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన చర్చల అంశాలను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వరకు అధికారులు మాకు వివరించారన్నారు. ఇక ముందు చర్చలకు రావాలంటే కొన్ని ఫ్రీ కండిషన్స్ ఉంటాయని చెప్పామన్నారు. పీఆర్సీ నివేదిక ఇస్తారా ఇవ్వరా అనేది స్పష్టం చేయాలని కోరామన్నారు. పీఆర్సీ ఒక బ్రహ్మపదార్థంగా మారిందని విమర్శించారు. పోస్ట్ డేటెడ్ చెక్ లాగా డీఏలు, అరియర్స్ ఎప్పుడో ఇస్తామనటం సమంజసం కాదన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు 16నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. దీనికి పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సిగ్గు పడాలన్నారు.
Read Also:వంగవీటిపై రెక్కీ నిర్వహించడం బాధాకరం: కళా వెంకట్రావు
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇస్తున్నాం అని ప్రభుత్వం నివేదిక ఇవ్వగలదా? జీతాలే ఇవ్వకుండా జీతాల స్థిరీకరణ చేస్తాం అంటే ఎలా నమ్మగలం? కాలక్షేపపు చర్చలకు మమ్మల్ని ఆహ్వానించ వద్దని చెప్పామని సూర్యనారాయణ వెల్లడించారు. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో తాలూకా స్థాయి వరకు ఉద్యోగుల చైతన్య యాత్రలు చేపడుతున్నాం. 50 మంది నాయకులు పర్యటిస్తాం.రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పీఆర్సీ పేరుతో జరుగుతున్న ప్రహసనాన్ని, అధికారుల నిర్లిప్త వైఖరిని ఉద్యోగుల్లో కి తీసుకుని వెళ్లి ఎండగడతామన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించాలి.ఐఏఎస్ అధికారులు తమ శాఖాపరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తరుచు విఫలమవుతున్నారు. వారే విఫలం అవుతున్నారా లేక ప్రభుత్వం నియంత్రిస్తున్నారా? అనేది అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు. దీర్ఘకాలిక పోరాటానికి శ్రీకారం చుడుతున్నాం
113 అంశాల పై అధ్యయనం చేశామని దీనిపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుతామని సూర్యనారాయణ తెలిపారు.