Supreme Court: అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారణ చేయవద్దన్న తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టుకు సూచనలు చేసింది. బెయిల్ పిటిషన్లలో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది.. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొనింది. బెయిల్ పిటిషన్లపై వెయిటింగ్ చేయాలన్న హైకోర్ట్ ఆదేశం సరికాదు అని సుప్రీంకోర్టు వెల్లడించింది.
అయితే, బెయిల్ కోసం వెయిట్ చేయాలని చెప్పడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అని సుప్రీంకోర్టు తెలిపింది. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే విచారించి నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చారు. అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది.