ఇవాళ ఏపీలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర సహ ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే…ఏపీలో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు గత ప్రభుత్వం చంద్రన్న పేరు పెట్టుకుంటే.. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న పేరుతో అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి స్వంతంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసే సత్తా లేదని నిలదీశారు. ఏపీలో సొంత పార్టీ కార్యకర్తలపైనే వైసీపీ దాడులకు దిగుతోందని.. ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేయటం అమానుషమని ఆయన ఫైర్ అయ్యారు. ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని.. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా భూమి లభించడం లేదని ఆయన అన్నారు. ప్రజలు చూస్తు ఊరుకోరని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయం మేరకు పనిచేయాలన్నారు. మత స్వేచ్ఛ హక్కు అందరికి ఉందని, దానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లడం సరికాదని సునీల్ ధియోధర్ అభిప్రాయపడ్డారు.