పీఆర్సీ, ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ వ్యవహారం ఏపీలో కాకరేపుతోంది. అయితే, మరోసారి చర్చలు కొనసాగుతున్నాయి.. దీంతో.. కార్మికుల సమ్మె డెడ్‌లైన్ కంటే ముందే.. ఈ వ్యవహారానికి పులిస్టాట్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఇక, ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, పట్టువిడుపులకు మేం కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయన్న ఆయన… కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేం సర్దుబాటు చేసుకోవాల్సి ఉందన్నారు.. సమ్మె నోటీసులో ఇచ్చిన అన్ని అంశాలపై ఉద్యోగులు కోరుకున్నట్లు రికవరీ లేకపోవడం, ఐదేళ్ల పీఆర్సీ పట్ల మేం సంతృప్తిగా ఉన్నామన్నారు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే స్కేళ్లపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక కావాల్సిందే అని.. మెజారిటీ ఉద్యోగులు సంతోషపడే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఆశాభావంతో ఉన్నాం.. ఇవాళ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నాం అన్నారు వెంకట్రామిరెడ్డి.