ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబదేవి కూడా కొలువైన శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో ఎస్.లవన్న వెల్లడించారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు.
అయితే కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు.శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10లోగా ఆలయ కార్యాలయానికి లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుందని ఈవో లవన్న సూచించారు. ఆ తర్వాత వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
