Gunda Appala Suryanarayana Passes Away: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అలియాస్ గుండ సూర్యనారాయణ కన్నుమూశారు. ఇంటిలో కాలుజారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలవ్వగా, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రమవడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుండ అప్పలసూర్యనారాయణ మృతి వార్తతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్ధివ దేహాన్ని అరసవిల్లిలోని స్వగృహానికి కుటుంబ సభ్యులు తరలించారు..
Read Also: Shikhar Dhawan: సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్.. ‘గబ్బర్’ లైఫ్ లో కొత్త మలుపు
గుండ అప్పలసూర్యనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1981లో శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, అనంతరం టీడీపీలో చేరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 1985, 1989, 1994, 1999 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలిచి ఎమ్మెల్యేగా సేవలందించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కాయి. 1987లో కరువు శాఖ మంత్రిగా, 1989లో బీసీ, ఎస్సీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇక, గుండ అప్పలసూర్యనారాయణ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు రాజకీయ ప్రముఖులు.. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా పేరుగాంచిన గుండ అప్పలసూర్యనారాయణ మృతి జిల్లా రాజకీయాలకు తీరని లోటుగా పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, 2014 ఎన్నికల్లో ఆయన సతీమణి గుండ లక్షీదేవి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ సీనియర్ నేత మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుతున్నారు.