Kotamreddy Sridhar Reddy: రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ రూరల్ ఇంచార్జ్, సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి నా దగ్గరకి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చాను.. వివిధ సమస్యల్లో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు.. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు.. జూలై 16వ తేదీన నేను, గూడూరు ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన లేఖను తిరస్కరిస్తూ అధికారులు మా ఇద్దరికీ రాత పూర్వక సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, జులై 30న అధికారులు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేశారు. 16న మా లేఖలని తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారు.. దీనిపై విచారిస్తున్నామని హోంశాఖ మంత్రి అనిత చెప్పారని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Manisha Koirala : రిలేషన్లే నా జీవితాన్ని నాశనం చేసాయి: మనీషా కోయిరాలా
అయితే, పెరోల్ లేఖలు ఇవ్వడమే తప్పని వైసీపీ అంటోంది.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు ఇదే శ్రీకాంత్ కి లేఖలు ఎలా ఇచ్చారని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఆ లేఖల ఆధారంగా శ్రీకాంత్ కి అప్పట్లో పెరోల్ కూడా ఇచ్చారని తెలిపారు. ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వను.. అధికారానికి 16 నెలల ముందే నేను గత ముఖ్యమంత్రి జగన్ ని వ్యతిరేకించి బయటకు వచ్చా.. నేను దందాలు చేసి ఉంటే వైసీపీలో ఉన్నప్పుడు నా మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ లో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా వేధించామా, దాడులు చేశామా.. వారిపై నేను ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కలు చూపించేవాడినని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.