Ration Mafia: నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న రేషన్ మాఫియా కూటమిలో కుంపటి రాజేసింది. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంతో రేషన్ మాఫియా చెలరేగుతుందని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలో రాజకీయ దుమారం రేపాయి. పార్టీకి ఎవరు చెడ్డ పేరు తీసుకొచ్చిన సహించను అంటూ అయన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెల్లూరు రేషన్ మాఫియాలో కింగ్ పింగ్ గా ఉన్న సివిల్ సప్లై రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వైపే అధికార పార్టీ నేతలు చూపు వెళ్ళింది. ఆయన కనుసన్నల్లోనే రేషన్ మాఫియా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. తన శాఖ మీద విమర్శలు చెయ్యడాన్ని మంత్రి నాదెండ్ల సీరియస్ అయ్యారు.
Read Also: Andhra Pradesh Train Crime: కదులుతున్న రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
నెల్లూరు కేంద్రంగా జరుగుతున్న రేషన్ దందాపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. పలు మిల్లులో రీసైక్లింగ్.. ఆపై అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు ఎవరిని దానిపై సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరా తీస్తున్నారు. సివిల్ సప్లై అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో.. వారితో మంత్రి నాదెళ్ల మనోహర్ సమావేశమయ్యారట. వారి వద్ద నుంచి సమాచారం తీసుకుని.. రేషన్ దందాపై ఉన్నతాధికారులతో దర్యాప్తు జరపాలన్న ఆలోచనలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారట. ఇదే సమయంలో రేషన్ మాఫియాకి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని మంత్రి నాదెండ్ల మందలించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ మంత్రి నాదెండ్ల తన శాఖకు చెందిన ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారట..
ఇటీవల నెల్లూరు రూరల్ పరిధిలో ఐదు లారీలలో తరలిస్తున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. వాటిలో రెండు లారీల్లో మాత్రమే రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అనంతసాగర్ మండలానికి చెందిన మహేష్ అనే వ్యక్తిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మిగిలిన మూడు లారీలని వదిలేశారు. అయితే ఈ వ్యవహారంపై నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. రేషన్ మాఫియా కి సివిల్ సప్లై అధికారులు సహకరిస్తున్నారని విమర్శించారు. అధికారులు పట్టుకున్న ఐదు లారీలలో రేషన్ బియ్యం ఉన్నాయని.. అయితే, రెండు లారీల్లో మాత్రమే రేషన్ బియ్యం ఉన్నట్లు… మిగిలిన మూడు లారీలని వదిలేసారని ఆయన ఆరోపించారు. జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాఫియా వెనుక ఎవరున్నా వదిలేది లేదంటూ.. వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు పార్టీలో ప్రచారం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. వారిద్దరిని మందలించింది..
నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా చేస్తున్న వారిలో ఇద్దరు ముగ్గురు కీలక వ్యాపారులో ఉన్నట్లు సివిల్ సప్లై శాఖలో ప్రచారం జరుగుతుంది. వారిలో అనంతసాగరం మండలానికి చెందిన మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు. వీరందరూ సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని టిడిపిలో చర్చించుకుంటున్నారు. వీరందరూ సిండికేట్ ఏర్పడి.. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి మిల్లులో రీసైక్లింగ్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు. జిల్లాలో సుమారు 80 శాతం రేషన్ బియ్యాన్ని వీరు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసుకుని.. పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఐతే తమ నియోజకవర్గాల్లో జరిగే రేషన్ దందా.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు తెలియకుండానే జరుగుతోందని.. వారి వారి అనుచరులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఎంత జరుగుతున్న సివిల్ సప్లై అధికారులు గానీ విజిలెన్స్ అధికారులు కానీ కనీసం తనిఖీలు దాడులు చేయకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే ఈ మాఫియా లో కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో.. అధికారులు సైతం మౌనంగా ఉండి పోతున్నారు. అయితే రేషన్ మాఫియా పై నువ్డా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శలు చేయడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో జిల్లాకు చెందిన సివిల్ సప్లై అధికారి విజయ్ కుమార్, సివిల్ సప్లై డిఎం అర్జున్ రావు, ASO, సివిల్ సప్లై డిటిలను మంత్రి నాదెండ్ల మనోహర్ పిలిపించుకొని.. పూర్తి వివరాలు తీసుకున్నారట.