Rowdy Sheeter Srikanth: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అరుణ, రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆగడాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ అక్రమ చర్యలపై ఆరా తీసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక, రౌడీషీటర్ ప్రియురాలు అరుణ ఉపయోగించిన ఫోన్లోని వాయిస్, వీడియో రికార్డులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ వీడియోలు, ఆడియోలు బయటకు వస్తే మొత్తం సూత్రధారులు, పాత్రదారులు అందరూ బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇక, రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ వ్యవహారాల్లో పోలీస్ శాఖలోని కొంతమంది ఉన్నతాధికారులు, ఏఆర్ సిబ్బంది సహకరించారనే అనుమానాలపై కూడా విచారణ కొనసాగుతుంది. ఈ కోణంలో ఆ అధికారులపై దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మరోవైపు, అరుణ తనను మోసం చేసిందని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ కేసు మరో టర్న్ తీసుకుంది. ప్రస్తుతం కేసు చుట్టూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటంతో నెల్లూరు జిల్లా రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.