జగన్ సర్కార్ పై సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు..? అని నిలదీశారు. పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పగించాలని సవాల్ విసిరారు.
పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లు ఇచ్చామని… మరో రూ. 700 కోట్లు ఇవ్వాల్సి ఉంది.. దీన్ని త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు సోము వీర్రాజు. పోలవరం కట్టిన లెక్కల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే షెకావత్ ను తప్పు పడతారా..? అని ప్రశ్నించారు. తప్పు జరిగితే చర్యలు తీసుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తారా..? అని ఫైర్ అయ్యారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన అంశంపై ఇప్పుడేదో తూతూ మంత్రంగా విచారణ కమిషన్ వేశారని…ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.