ఎంత పెద్ద మనిషైనా పాములు కనిపించగానే పై ప్రాణాలు పైనే పోతాయి. పాముని చూడగానే అక్కడినించి పరుగు లంకించుకుంటారు. పాములు పగబడతాయా..వెంటాడి కాటేస్తాయా? తప్పించుకున్న వదలవా? పాపాతికేళ్ల క్రితం పాము.. పాము పగతో సినిమాలు రావటం.. పాము పగ మీద బోలెడన్ని విషయాలు తరచూ మాట్లాడుకోవటం కనిపించేది. పాములు పగబడతాయని.. వెంటాడి.. వెంటాడి మరీ కాటేస్తాయని నమ్ముతోంది ఓ కుటుంబం. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని ఒక ఫ్యామిలీని వణికిపోతోంది. మరే కుటుంబం దొరకనట్లుగా.. ఒకే కుటుంబంలోని వ్యక్తులను వరుస పెట్టి కాటేస్తున్న వైనంతో.. సదరు కుటుంబం టెన్షన్ తో వణికిపోతోంది.
సాధారణంగా పాములకు ఏదైనా హాని కలిగిస్తే పగబడతాయంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఎంతోమంది నిజంగానే పాములు పగపడతాయని నమ్మి భయపడిపోతుంటారు. అయితే పాములు పగ పట్టడానికి సంబంధించిన కొన్ని ఘటనలు మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోతుంటాయి. ఇక కొన్ని రకాల ఘటనలు చూసిన తర్వాత నిజంగానే పాములు పగ పడతాయని నమ్మకుండా ఉండలేరు. చిత్తూరు జిల్లాలో తరచూ ఇలాంటివి జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో గత నెలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పాము కాటుకు గురై కోలుకున్నారు. రెండురోజుల క్రితం అదే కుటుంబానికి చెందిన మహిళను మరో వృద్ధుడిని పాము కాటేసింది. వృద్ధుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ధోర్ణకంబాల ఎస్టీ కాలనీలో గురవయ్య ఫ్యామిలీ నివసిస్తోంది. ఆ కుటుంబంలో గురవయ్య, ఆయన కుమారుడు వెంకటేష్ దంపతులు, కుమారుడు జగదీష్ ఉన్నారు. గ్రామానికి చివరిలో ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ బండిపై ఐస్ క్రీంలు గ్రామాగ్రామాన తిరిగి అమ్మే వాడు. కూలీ పనులు చేసేవాడు. కుమార్తెను బంధువుల ఇంటిలో ఉంచి చదివించాడు. కొడుకుని పదో తరగతి వరకూ చదివించాడు.ఐదేళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఓ చిన్న గుడిసె వేసుకుని కాలం వెళ్ళ దీస్తున్న వారిని నాగుపాము ఇబ్బందులు పెడుతోంది. ఓ చిన్న పాటి కొండ కింది భాగంలో నివాసం ఉంటున్న వెంకటేష్ ఓ రోజు ఇంటి పరిసరాలు శుభ్రం చేస్తుండగా కత్తి జారీ పొదల్లో ఉన్న నాగుపాముపై పడింది. ఇది గమనించిన వెంకటేష్ పెద్దగా పట్టించుకోలేదు. పాము వెళ్లిపోయిందిలే అనుకున్నాడు. ఓరోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న టైంలో నాగుపాము ఇంట్లోకి వచ్చి గురవయ్యను కాటు వేసింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు.
నెల రోజుల వ్యవధిలో దాదాపు తొమ్మిది సార్లు ఒకరి తరువాత ఒకరిని పాము కాటు వేస్తూనే ఉంది. ఫ్యామిలీ వాళ్లు పాము కాటుతో ఆసుపత్రి చుట్టూ తిరగడం రొటీన్ అయిపోయింది. గత నెలలో వెంకటేష్, వెంకటమ్మ,గురవయ్యను రెండేసి సార్లు పాము కాటు వేసింది. జగదీష్ ను మూడు సార్లు కాటు వేసింది. ఇక పాము కాటు వేసి ప్రతిసారి స్థానికులు సకాలంలో స్పందించి 108కు కాల్ చేయడం హాస్పిటల్ కు తరలించడం అలవాటుగా మారిపోయింది. ఇన్ని సార్లు పాము కాటుకు గురైన ఆ కుటుంబం సభ్యులు ప్రాణాపాయం నుంచి బయట పడగలుగుతున్నారు. గత పది రోజుల క్రిందట పాము కాటు వేయడంతో వెంకటమ్మ, జగదీష్ ఆసుపత్రిలో చేరారు.. ఆసుపత్రి నుంచి రెండు రోజుల క్రితం డిశ్చార్ అయ్యి ఇంటికి చేరుకున్న రాత్రే మళ్లీ పాము కాటేసింది. మళ్లీ 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వెంకటేష్ మాత్రం ఏ కర్మో ఏమో గానీ దేవుడు ఎలా చూస్తే అలానే జరుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అసలు పాము ఎందుకు తమ కుటుంబంపైనే పగ పట్టిందో తమకు ఏమాత్రం అర్ధం కావడం లేదంటున్నారు. ఆస్పత్రి నుంచి రావడం మళ్ళీ పాముకాటుకి గురికావడం… చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరుగుతూనే వుంది. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కోలుకుని రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకున్నాడు. మళ్లీ గురువారం తెల్లవారుజామున వెంకటమ్మను పాము కాటేయండంతో ఆటోలో చంద్రగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తిరుపతి రుయా తరలించారు. ఇంతలో ఇంట్లో ఉంటున్న వృద్దుడు గురువయ్య పాముకాటుకు గురైనట్లు ఫోన్ రావడంతో మనవడు జగదీష్ వృద్దుడిని కూడా రుయా లో అడ్మిట్ చేశాడు. వెంకటమ్మ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండగా.. గురవయ్య ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది.ఇలా 55 రోజుల్లో 15 సార్లు పాము కాటుకి గురైంది ఆ కుటుంబం.
ఈ వరుస ఘటనలతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం మాత్రం ఇంటి చుట్టూ పాము పుట్టలు ఉండడం వల్ల అనే మాట గట్టిగా వినపడుతుంది . పాము పగలాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు..అయితే ఈ ప్రమాదాలకు గురవుతున్న కుటుంబ పెద్ద వెంకటేష్ మాత్రం పాములు తమనే కాటేస్తున్నాయని, పక్కన ఉన్నవారికి ఎలాంటి హానీ చేయడం లేదంటున్నారు. ఇంతకీ ఆ ఫ్యామిలీ పాము పగ నుంచి ఎలా విముక్తిపొందుతుందో చూడాలి.