స్మార్ట్ సిటీ విశాఖలో అదో స్మార్ట్ భవనం. దూరం నుంచి చూస్తే రోటీన్ గానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే ఔరా…!!.అనిపిస్తుంది. ఇంతకు ఏమిటా బిల్డింగ్ ప్రత్యే కత. ఇంత స్మార్ట్ ఆలోచన వెనుక ప్రేరణ ఎవరు..!? అలా విశాఖ వరకూ వెళ్ళొద్దాం రండి.
విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ప్రధానమైనది గురుద్వారా జంక్షన్. ఇక్కడ ఉన్న ఓ హోటల్ నిర్మాణం రోటీన్ కు భిన్నంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నిర్మాణం 100శాతం గ్రీన్ బిల్డింగ్. సహజంగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం మనకు కనిపిస్తుంది. కానీ, విశాఖ వ్యాపారి ఆలోచనల్లో నుంచి పుట్టిన ప్లాన్ ప్రకారం మొత్తం భవనం అంతటా సోలార్ ప్యానెళ్లు బిగించారు. భవనం లోపల, వెలుపల సోలార్ పలకలు ఉండగా….అకస్మాత్తుగా చూసిన వారు వీటిని డిజైన్ గా భావించే అవకాశాలే ఎక్కువ.
అయిదు అంతస్తుల భవనానికి మొదటి అంతస్తు నుంచి చివరవరకు చుట్టూ సౌర పలకలనే అలంకరణగా ఉపయోగించారు. వీటి ద్వారా రోజుకు 78 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. నెట్ మీటరింగ్ ద్వారా మిగిలిపోయిన కరెంట్ గ్రిడ్ కు విక్రయించడం ద్వారా ఆదాయం పెంచుకోవలనేది ఆలోచన. ఎలివేషన్ కోసం నలుపురంగు అద్దాలకు బదులు సోలార్ ప్యానళ్లను ఉపయోగించడం వల్ల కాస్త ఖర్చయినా కొత్తదనంతో పాటు అదనపు ఆదాయం సమకూరుతుంది. పెరుగుతున్న విద్యుత్తు డిమాండు వల్ల ఎక్కువ మంది సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఆలోచనల్లో నుంచి వచ్చిందే సోలార్ బిల్డింగ్.
Read Also: Tirumala: భక్తులతో కళకళ… శ్రీవారి హుండీ గలగల