సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేయడం అనివార్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయితే అభివృద్ధి జరగడం లేదని, జగన్ ఫెయిల్యూర్ సీఎం అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అప్పులు చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
జ్యోతిబా ఫూలే వంటి మహనీయులు కలలుగన్న రీతిలో బడుగు, బలహీనవర్గాలకు కూడా పదవులిచ్చి, వారి ఆర్థిక స్వావలంబనకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని, అందుకోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తూ వారి కోసం ప్రత్యేకంగా పథకాలు తెచ్చారన్నారు. బీసీ జనగణనపై అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని మోపిదేవి అన్నారు.