ఎగువ నుంచి భారీ వరదలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది.. లంక గ్రామాలను గోదావరి ముంచెత్తుతోంది.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరింది నీటిమట్టం.. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. బ్యారేజీ నుండి 15 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. అయితే, గడిచిన 24 గంటలూగా గోదావరిలో అదే పరిస్థితి కొనసాగుతోంది.. అయితే, ధవళేశ్వరం దగ్గర 11.75 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటారు.. ఇది రెండు గ్రామాలు, 272 కుటుంబాలు, 1128 మందిపై వరద ప్రభావం చూపుతుంది.. ఇక, 13.75 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక ఇష్యూ చేస్తారు.. ఇది, 40 గ్రామాలు, 19,228 కుటుంబాలు, 76,612 మందిపై ఎఫెక్ట్ పడుతుంది.. అదే, 17.75 అడుగులు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.. ఇది ఏకంగా 31,382 కుటుంబాలు, 1,25,380 మందిపై ప్రభావం చూపుతుంది.
Read Also: Congress: జూలై 21న దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు
మరోవైపు, పెరుగుతున్న గోదావరి వరద ఉధృతిని పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోందని.. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.22 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని.. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం లేకపోలేదని పేర్కొంది.. ఇక, సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.. అల్లూరి జిల్లాలో 4, అంబేద్కర్ కోనసీమలో 3, ఏలూరులో 2, తూర్పుగోదావరి లో 1, పశ్చిమగోదావరి లో 2 బృందాలు పనిచేస్తున్నాయని.. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు.