తూర్పుగోదావరి జిల్లాలో స్కార్పియో వాహనం బీభత్సం కలిగించింది. ఒకరు దుర్మరణం పాలయ్యారు. కత్తిపూడి నుండి పిఠాపురం వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పింది. గొల్లప్రోలు టోల్ ప్లాజా నుండి ఆపకుండా గేట్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది CG1100 నెంబర్ గల స్కార్పియో వాహనం.
దీంతో కారును వెంబడించారు గొల్లప్రోలు హైవే పోలీసులు. పిఠాపురంలో బైపాస్ రోడ్ విరవాడ జంక్షన్ వద్ద వేగంగా వచ్చి యాక్టివా బైక్ ను ఢీకొట్టింది స్కార్పియో వాహనం. బైక్ పై వెళ్తున్న పిఠాపురానికి చెందిన చందక అప్పారావు (60)అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అక్కడ నుండి పరారై పెద్దాపురం మండలం దివిలిలో రెండు పళ్ళ బండ్లను ఢీ కొట్టి జగ్గంపేట వైపునకు అతి వేగంగా వాహనంతో పరారయ్యారు అగంతకులు. స్కార్పియో వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు పోలీసు ఉన్నతాధికారులు. టోల్ ప్లాజా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.