సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో సందడి నెలకొంటుంది. తొలుత కోడిపందాలపై నిషేధం వున్నా.. చివరి నిముషంలో కోడిపందాలు యథేచ్ఛగా సాగాయి. బరుల్లో కోట్లు చేతులు మారాయి. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పార్వతీపురంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరులలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి . సోమవారం జరిగిన కోడిపందాలు బరులలో రకరకాల జూద క్రీడలు దర్శనమివ్వటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మూడు ముక్కల పేకాట బోర్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలను ముద్రించి సీఎం జగన్ ఎరుపు అని , మాజీ సీఎం చంద్రబాబు నలుపు అని ఉన్న బోర్డుపై పేకలతో జూదం నిర్వహించారు నిర్వాహకులు.
Read Also:Hotel Bill : లగ్జరీ హోటళ్లో దిగాడు.. లక్షల బిల్లు ఎగ్గొట్టాడు
ఇది చూసి ఆ పార్టీల నేతలు కూడా ఖండించకపోవటం పట్ల పలు ప్రజా సంఘాల నేతలు , సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇరు పార్టీలకు చెందిన నేతలు కూడా అభ్యంతరం చెప్పకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలో కోడిపందాలు ఎక్కువగా జరిగాయి. పెడన మండలం తోటమాలలో కోడిపందాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త కోడిపందాల్లో ఓడిపోయి తనకున్న బండి తాకట్టు పెట్టాడని కోపంతో భార్య మనస్తాపానికి గురయింది. అంతేకాదు ఆవేశంతో గర్భవతిగా వున్న భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన భర్త, బంధువులు హుటాహుటిన మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స జరుగుతోంది.
Read Also: Top Headlines @9PM: టాప్ న్యూస్