సిఎం జగన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఢిల్లీ వెళ్లి 5 గురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని కలిశారని.. అదనపు సహాయం, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లిన అన్ని అంశాలను మీడియాకు ఎప్పటికప్పుడు వెల్లడించామని.. ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకునే వారని మేము చేసిన ఆరోపణలు వాస్తవం అని తర్వాత తేలిందన్నారు.
బీజేపీ ప్రభుత్వంలో అప్పుడు టీడీపీ భాగస్వామి అని.. పోలవరం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేసిందో మనం చూశామని గుర్తు చేశారు. అందుకే ఆరు అడుగులు తవ్వి ప్రజలు టీడీపీని భూస్థాపితం చేశారని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ నిరంతరం యజ్ఞంలా చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీకి, వారికి మద్దతు ఇచ్చే మీడియాకు కడుపు మంట ఏంటో అర్థం కావటం లేదని.. జగన్ పై పెట్టిన కేసులు కాంగ్రెస్, టీడీపీ చేసిన కుట్ర అని అందరికీ తెలిసిన విషయమేనని చురకలు అంటించారు. ప్రజా న్యాయస్థానంలో ప్రజలు జగన్ పై ఉన్న ఆరోపణలను అనేక సార్లు తిప్పి కొట్టారని పేర్కొన్నారు.