NTV Telugu Site icon

Sajjala ramakrishna Reddy: షర్మిల అరెస్ట్‌ బాధాకరం.. ఆమె రాజకీయ నిర్ణయాలపై మేం స్పందించం..

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

తెలంగాణలో వైఎస్‌ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనకు.. షర్మిల్‌ అరెస్ట్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఆయన స్పందిస్తూ.. షర్మిల అరెస్ట్‌ బాధాకరం అన్నారు.. మా నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు.. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు.. మాది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఆమె తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ పెట్టుకున్నారు.. ఆమె రాజకీయ విధానాలపై స్పందించబోమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Read Also: The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా.. దీనివలనే జమ్మూకశ్మీర్ లో హత్యలు ఎక్కువ అయ్యాయి

కాగా, హైదరాబాద్‌లో కొంత హైడ్రామా నడిచింది.. పోలీసుల కన్నుగప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్నారు వైఎస్‌ షర్మిల.. సోమాజిగూడ నుంచి ప్రగతి భవన్‌కి వెళ్లేందుకు ప్రయత్నించారు.. నిన్న దాడిలో అద్దాలు పగిలిన తన కారును ఆమెనె స్వయంగా డ్రైవింగ్‌ చేస్తూ తీసుకొచ్చారు.. అయితే, ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో, రోడ్డుపైనే వాహనం నిలిచిపోయింది.. కారు నుంచి బయటికి రావాలని పోలీసులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఆమె నిరాకరించారు.. ప్రగతి భవన్ కి వెళ్తానంటూ పట్టుబట్టారు.. అయితే, కారు డోర్లను లాక్‌ చేసుకుని లోపలే ఉండిపోయారు షర్మిల.. ఇక, చేసేది ఏమీ లేక.. షర్మిల కారు లోపల ఉండగానే.. ఆ కారును ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.. ఆ తర్వాత కారు డోర్స్ బ్రేక్ చేసి షర్మిలను పీఎస్‌లోకి తరలించారు..

ఇక, షర్మిలను అరెస్ట్ చేయడంతో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్రేన్ సాయంతో కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచారు. అనంతరం షర్మిలను పీఎస్‌ లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు పోలీస్‌స్టేషన్‌కు భారీగా వైఎస్సార్టీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. వారికి చెదరగొట్టారు పోలీసులు.. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో షర్మిలపై కేసు నమోదైంది.. వీఐపీ మూమెంట్ ఏరియాలో ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలపై 353, 333, 327 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..