ఏపీలో ఈనెల 11న సీఎం జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. దీంతో చాలా మంది వైసీపీ నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నారని సజ్జల తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. కేబినెట్‌లో మెజార్టీ మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ జస్టిస్‌కు అనుగుణంగా సీఎం జగన్ కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా మరోవైపు కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు మొత్తం పూర్తయిందని సజ్జల తెలిపారు. కొత్త జిల్లాలపై ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వస్తుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకొని జిల్లాలను విభజన చేశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మనో భావాలు దెబ్బతినకుండా జిల్లాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చిన్న చిన్న మార్పులతోనే తుది నోటిఫికేషన్ వెలువడనుందని తెలిపారు. పౌర సంఘాల సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని.. 90శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కొత్త జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్, పొలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒకే చోటా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని సజ్జల వెల్లడించారు. కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు 15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు పూర్తవుతాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత వైసీపీ శ్రేణులను మోటివేట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహిస్తామని సజ్జల తెలిపారు. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అన్నారు. డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఎకరాకు రూ.2కోట్లు అవసరం అవుతుందని సీఎం లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పారని గుర్తుచేశారు. కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా అన్నారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడమేంటన్నారు. నిధులు ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చన్నారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారన్నారు.
https://ntvtelugu.com/ugadi-panchangam-in-ap-cm-jagan-camp-office/