Rythu Bhorosa Kendras Are Biggest Scam In AP Says Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం.. రైతు భరోసా కేంద్రాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెనాలీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మొత్తం 10,700 రైతు భరోసా కేంద్రాలున్నాయని, వాటన్నింటిలోనూ అవినీతి జరుగుతోందని విజిలెన్స్ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు. రైతుల వద్ద లంచాలు తీసుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని.. ఈ-క్రాప్ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, తూకాల్లో రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులు.. రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులకు కులాల వారీగా గుర్తిస్తున్నారని మండిపడ్డారు. అటు.. గంజాయి కేసుల్లో కూడా పెద్ద తలకాయల్ని పక్కన పెట్టేసి, చిన్నవాళ్లని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారన్నారు. గంజాయి నిర్మూలన చేస్తున్నందుకే గత డీజీపీని తొలగించారని పేర్కొన్నారు.
అంతకుముందు.. ఇళ్ల నిర్మాణంలోనూ పేదలకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఇది ‘జగనన్న ఇళ్లు గుల్ల పథకం’ అని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు ఇసుకను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానిది దోబూచులాట అని.. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహాలు అర్హులైన పేదలకు చెందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసేశారు. దీని వెనుక ఉన్న అసలు కారణాల్ని ప్రజలకు తెలియజేసేందుకు జనసేన నడుం బిగించిందని.. క్షేత్ర స్థాయిలో ఇల్లు కట్టుకునేందుకు పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో తాము బయట పెడతామని హెచ్చరించారు. ఈ విషయాలపై నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని తెలియజేశారు.