ఏపీలో కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాల్లో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.
కొత్తపేట రెవెన్యూ డివిజనులో ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ. కడప జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజనుగా పులివెందులను ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. జమ్మలమడుగు, కడప రెవెన్యూ డివిజన్లలోని 8 మండలాలను వేరు చేసి కొత్తగా పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. పులివెందుల రెవెన్యూ డివిజన్ లో సింహాద్రిపురం, లింగాల, తొండుర్, పులివెందుల,వేముల,వెంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ జారీచేసింది.
పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో కడపలో 4కు పెరిగాయి రెవెన్యూ డివిజన్లు. కృష్ణా జిల్లాలోని కొత్తగా ఏర్పాటైన ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ లో పామర్రు మండలాన్ని, మచిలీపట్నంలో ఘంటసాల మండలాన్ని మార్పులు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో నగరి రెవెన్యూ డివిజన్లోని రెండు మండలాలను చిత్తూరు రెవిన్యూ డివిజన్ లోకి మారుస్తోంది. నగరిలోని శ్రీరంగరాజపురం, వెదురు కుప్పం మండలాలను చిత్తూరు రెవిన్యూ డివిజనుకు మార్పు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.