ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన పార్టీలోకి చేరికలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఏపీ కేడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన దేవ వరప్రసాద్ గురువారం నాడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు.
కాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన దేవ వరప్రసాద్ ఏపీ ప్రభుత్వంలో పలు హోదాల్లో 30 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. అనంతరం కార్యదర్శి స్థాయిలో రిటైర్ అయ్యారు. జనసేన పార్టీలో చేరిన సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చక్కబడి అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం అవసరమన్నారు. పవన్ కళ్యాణ్ ద్వారానే ఏపీలో మంచి పరిపాలన సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
జనసేనలో చేరిన విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ వరప్రసాద్ గారు pic.twitter.com/YYHehewDVX
— JanaSena Party (@JanaSenaParty) June 23, 2022