దేశంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆయా రాష్ట్రాల అప్పుల వివరాలను ప్రకటించింది. దేశంలో అప్పుల భారం ఎక్కువగా ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్దారించిన రుణ, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్ దాటేసిందని ఆర్‌బీఐ వివరించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అధికంగా జీఎస్‌డీపీలో 9 శాతం బ్యాంక్ గ్యారంటీలను ఏపీ రాష్ట్రం ఇచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నెలరోజుల్లోనే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, చేబదులు అవకాశాలను ఏపీ పూర్తిగా వాడేసినట్టు తెలిపింది.
ఈ స్థాయిలో అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, మణిపూర్, నాగాలాండ్ ఉన్నట్టు ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకునే ఫెసిలిటీ తెలంగాణలో లేదని… ఆంధ్రప్రదేశ్‌కే ఉందని ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ ఫెసిలిటీ ఉపయోగించుకుని ఏపీ రూ.4వేల కోట్ల రుణం తీసుకుందని పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకునే అవకాశం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపింది. కాగా జాతీయ సగటుతో పోల్చుకుంటే ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం 8 శాతం దాటిందని ఆర్‌బీఐ వివరించింది. 2021-22 బడ్జెట్ ప్రకారం ఏపీ ఆదాయంలో 14 శాతం వడ్డీలకు వెళ్లిపోతుందని తెలిపింది.
అటు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలకు ఖర్చు చేసే మొత్తం రూ.27,541 కోట్లు అని.. ఇది జీఎస్‌డీపీలో 2.1 శాతానికి సమానం అని ఆర్‌బీఐ తెలిపింది. ఉచిత పథకాలకు పంజాబ్ తర్వాత అత్యధిక ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని పేర్కొంది. మొత్తం ఆదాయంలో 14.1 శాతం, సొంత ఆదాయంలో 30.3 శాతం ఉచిత పథకాలకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించింది.