Mali: బాగా సంపాదించి జీవితాన్ని మెరుగుపర్చుకోవాలి.. కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఆశతో విదేశానికి వెళ్ళిన ఓ తెలంగాణ యువకుడు అనుకోని ప్రమాదంలో ఇరుక్కున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ గత ఏడాది ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లాడు. బోర్‌వెల్ ప్రాజెక్టుల పర్యవేక్షణే అతని పని. ప్రతిరోజూ ఇంటికి ఫోన్ చేసి తన క్షేమం తెలియజేసే ప్రవీణ్, నవంబర్ 22 తరువాత ఒక్కసారిగా అంతు చిక్కకుండా పోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
నవంబర్ 22 మరుసటి ఉదయం విధులు ముగించుకుని గదికి చేరుకునే క్రమంలో అతను అదృశ్యమైనట్లు తెలుస్తోంది. మాలి దేశంలోని ఉత్తర ప్రాంతంలో క్రియాశీలంగా పని చేసే Jama’a Nusrat ul-Islam wa al-Muslimin (JNIM) ఉగ్రవాద గుంపు అతడిని అపహరించినట్లు ఆ తరువాత వెలుగులోకి వచ్చింది. పది రోజుల తరువాత కుంటుంబం బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించింది. ప్రవీణ్ కిడ్నాప్ కి గురైనట్లు కంపెనీ నిర్ధారించడంతో ఇంట్లో దుఃఖ వాతావరణం నెలకొంది. మాలిలో విదేశీయులను లక్ష్యంగా చేసుకునే గుంపులు ఇప్పటికే అనేక మందిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అదే గ్రూప్‌లో ప్రవీణ్ కూడా చిక్కుకున్నాడని అనుమానిస్తున్నారు. మాలి నుంచి పూర్తి వివరాలు రాలేదు. ఆ ప్రాంతంలోని అస్థిరత, ఉగ్రకేంద్రాల ప్రభావం కారణంగా గాలింపు చర్యలు కూడా కష్టతరంగా మారాయి. మరోవైపు.. ప్రవీణ్ తల్లిదండ్రులు, కుటుంబీకులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ కుమారుడిని ఎలాగైనా రక్షించి దేశానికి తీసుకురావాలని కోరుతున్నారు.