Amaravati: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు తొలి అడుగు పడబోతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వివక్షకు గురైన అమరావతి రాజధానిని మళ్లీ గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ సర్కార్ తీసుకున్న చర్యలలో భాగంగా ఇవాళ (బుధవారం) తొలి అడుగుగా కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అమరావతి రాజధాని అంతా గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిచ్చి చెట్ల, ముళ్ల చెట్లతో మొత్తం అడవిలా మారిపోయింది. దీంతో వీటిని తొలగించేందుకు సీఆర్‌డీఏ అధికారులు 36.50 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also: Anantapur Crime: దారుణం.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే..?
కాగా, సీఆర్డీఏ అధికారులు టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకోవడంతో.. నేటి (బుధవారం) ఉదయం 8 గంటలకు ఎన్‌సీసీఎల్ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టబోతుంది. సెక్రటేరియట్ వెనుక వైపున ఎన్ 9 రోడ్డు నుంచి ఈ పనులు స్టార్ట్ కానున్నాయి. మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఈ పనులను ఆరంభించనున్నారు. ఈ పనులపై మంత్రి మంగళవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జంగిల్ క్లియరెన్స్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. రాజధాని క్యాపిటల్ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలు పెట్టబోతున్నామని వెల్లడించారు. నెల రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.