ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సోమవారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు రావెల కిషోర్ బాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేఖ పంపారు. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు రావెల కిషోర్‌బాబు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన రావెల ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2019 ఎన్నికల తర్వాత రావెల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రావెల కిషోర్ బాబు తిరిగి టీడీపీ గూటికి చేరుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఆయన ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. 2014లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన రావెలకు చంద్రబాబు మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. అయితే రావెల తన వివాదాస్పద వ్యవహారశైలి కారణంగా మధ్యలోనే మంత్రి పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన టీడీపీపై విమర్శలు చేస్తూ వచ్చారు. చివరికి టిక్కెట్ ఇవ్వరని తెలిసిన తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.